ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును
ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకి వివరాలు అందించారు. ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డా. యల్లాప్రగడ సుబ్బారావు స్వస్థలం భీమవరం.. చదువుకున్నది రాజ మహేంద్రవరం కావున – కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏదైనా ఒకదానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని ఆయన కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖకు రాశారు.
ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి, పరిశీలించాలని సూచించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ‘అరియోమైసిన్’ కనుగొన్నది. డా. యల్లాప్రగడ సుబ్బారావు.. బోద వ్యాధికి సంబంధించి హెట్రజాన్, క్షయ వ్యాధి కట్టడికి ఐసోనికోటినిక్ ఆసిడ్ హైడ్రాజైడ్’ రూపొందించారు. క్యాన్సర్ కి వాడే కీమో థెరపీ ఔషధాల్లో తొలి తరం డ్రగ్ ‘మెథోట్రెస్సెట్’ ను మరో శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి చేశారు. భారతీయులందరికీ గర్వ కారణమైన శాస్త్రవేత్త డాక్టర్. యల్లా ప్రగడ సుబ్బారావు అన్నారు పవన్ కళ్యాణ్.