చంద్రబాబు అరెస్టుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు బాబు బెయిల్పై బయటకు రావడంతో లోకేశ్ యువగళం యాత్రను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎన్నో అవాంతరాలను అధిగమించి లక్ష్యం దిశగా అడుగు ముందుకేసేందుకు పార్టీ శ్రేణులతో కలసి ఇవాళ్టి నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న ఈ యాత్ర తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది.
రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశించనున్న లోకేశ్ పాదయాత్ర.. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్రను ముగియనుంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజుల్లో 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని మొదట లక్ష్యం నిర్దేశించుకోగా.. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, దిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు, జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులను కలవడం వంటి వ్యవహారాల్లో ఇన్నాళ్లూ లోకేశ్ తీరిక లేకుండా ఉన్నారు. దీంతో రెండున్నర నెలల పాటు విరామం తీసుకున్న ఈ యాత్ర తిరిగి ఇవాళ్టితో మళ్లీ మొదలుకానుంది.