తెలంగాణలో ఇటీవలే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన విషయం విధితమే. ఈ వ్యవహారం పై రాష్ట్ర నాయకత్వం నుంచి అటు ఢిల్లీ అధినాయకత్వం వరకు కూడా చర్చకు దారి తీసింది. మరికొంత మంది నాయకులు జరుగబోయే పరిణామాలు ఏంటో కూడా అంచనా వేసే పనిలోకి దిగారు. ఈ రహస్య భేటికి ముఖ్యుడుగా భావిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా స్పందించారు.
నగరం నడిబొడ్డున అందరం కలిసి ఒకచోట కలిస్తే.. అది సీక్రెట్ మీటింగ్ ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపై అంతా ఒకచోట కూర్చొని మాట్లాడుకున్నామని వెల్లడించారు. పలు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చామని తెలిపారు. దశాబ్దాల కాలం తరువాత మా పాలమూరు జిల్లా నుంచి రాష్ట్రానికి సీఎం అయ్యారని.. ఆయనకు ఎల్లప్పుడూ పిల్లర్లలా మేము ఉంటామని తెలియజేశారు అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల చుట్టు పక్కల ఉన్న వేలాది భూదాన్ భూములన్నీ గత ప్రభుత్వంలోని నాయకులు ధరణీ పేరుతో కొట్టేశారని మండిపడ్డారు.