ఆంధ్రప్రదేశ్లో 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ఏటా కాపు నేస్తం కింద రూ.15 వేలు అకౌంట్‌లో వేస్తుంది. ఈ ఏడాది ఈ పథకానికి సంబధించి అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నెల 22న కాపు నేస్తం నిధులను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బును జమ చేయబోతున్నారు. ఇప్పటికే వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద మహిళలు మూడు విడతల మేర డబ్బులు లబ్ధి పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం నాలుగో విడత డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయడానికి బటన్ నొక్కడానికి సిద్ధమయింది.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ మాధవి లత ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించగా ముఖ్యమంత్రి రూట్ మ్యాప్, సెయింట్ ఆంబ్రోస్ , హై స్కూల్లో పబ్లిక్ మీటింగ్ నెహ్రూ బొమ్మ సెంటర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హెలిప్యాడ్ కు స్థలాలను పరిశీలించడం జరిగింది. భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాలకు చెందిన మహిళలకు కాపు నేస్తం ప్రభుత్వం డబ్బులు అందిస్తున్న విషయం తెలిసిందే.
45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలను అర్హులుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000 , పట్టణ ప్రాంతాలలో రూ.12 వేల లోపు ఉండే మహిళా కుటుంబాలను అర్హులుగా పరిగణించారు. అదేవిధంగా కుటుంబానికి మూడు ఎకరాల మాగానీ లేదా 10 ఎకరాల మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉండకూడదని కూడా ప్రభుత్వం ఒక కొత్త నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు మాత్రమే అర్హులు అని కూడా తెలిపింది.
ఇక ఒక కుటుంబానికి కారు లేదా నాలుగు చక్రాల వాహనాలు అంటే అనర్హులు అని కూడా స్పష్టం చేసింది ట్రాక్టరు, ఆటో, టాటా ఏస్ వంటి జీవనోపాధికి ఉపయోగించే వాహనాలు ఉన్న వాళ్లకు మినహాయింపులు ఇచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.15, 000 చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్న నేపథ్యంలో ఈనెల 22న నాలుగో విడత డబ్బులు కూడా వారి ఖాతాలో జమ చేయనున్నారు.