మరోసారి జగన్ ప్రభుత్వం తీరుపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వరుస కౌంటర్లు చేశారు. అన్నమయ్య డ్యాం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ పవన్ ట్వీట్లు చేశారు. క్లాస్ వార్ అంటూ జగన్ చేసిన కామెంట్ల మీద పవన్ సెటైర్లు చేశారు. అధికారికంగా రూ. 500 కోట్ల విలువైన ఏపీ సీఎం నిరంతరం కార్ల్ మార్క్స్ లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని.. కార్ల్ మార్క్స్ లాగా ‘వర్గ యుద్ధం’ జగన్ మాట్లాడ్డం హాస్యాస్పదం అని ఆగ్రహించారు.
అణచివేసే వారే.. అణచివేతకు గురైనవారిలా మాట్లాడటం విడ్డూరం అని.. నా కామెంట్లపై సందేహాలు ఉంటే, ఏపీ మానవ హక్కుల సంఘాలను సంప్రదించండని కోరారు. 19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం తెగిపోయిందని.. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వల్ల.. ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపత్తూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారని తెలిపారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారని.. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని వివరించారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారన్నారు పవన్ కళ్యాణ్.