వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్ కో కు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును.. టన్ను రూ.8,500లకు విక్రయించిందన్నారు. అధిక ధరకు కొని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
విజయసాయి వియ్యంకుడికీ ఆదాయం కోసం ప్రజలపై ట్రూ అప్ ఛార్జీలు వేశారన్నారు. ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరా పై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని.. దీనిపై సీఐడీ, విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదని ప్రశ్నించారు. విజయసాయి దొంగల ముఠా పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జగన్ కుంభ కోణాలపై చర్యలకు వివిధ శాఖల్లో సిబ్బంది కూడా సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు. 108, 104 స్కామ్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రిని సోమిరెడ్డి కోరారు.