వైసీపీకి చెక్ పెట్టడానికి కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న చంద్రబాబు, పవన్ పోరాటం చేసే విషయంలో ఒకే బాటలో వెళుతున్నట్లు తెలుస్తుంది. ఏ మాత్రం వైసీపీకి గ్యాప్ ఇవ్వకుండా ఇరుకున పెట్టేందుకు చూస్తున్నారు. అయితే వారిని నిలువరించి ఏదొక విధంగా సెంటిమెంట్ లేపి..తాను ఒంటరిగా పోరాడుతున్నానని, ప్రజలకు పథకాల పేరిట రెండు లక్షల కోట్లు ఇచ్చానని, కాబట్టి తనకు ప్రజలకు అండగా ఉండాలని జగన్ కోరుతున్నారు.
అయినా సరే ఏదొకవిధంగా జగన్ ని ఇరుకున పెట్టేలా బాబు, పవన్ వ్యూహాలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటూ చంద్రబాబు పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో నష్టపోయిన రైతుల కోసం రోడ్డు ఎక్కారు. వెంటనే రైతులకు సాయం అందించాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే పోరాటానికి దిగుతానని అన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 12న బాబు పోరుబాట పట్టనున్నారు. తనుకులో రైతుల కోసం ఒకరోజు పాదయాత్ర చేయనున్నారు. అలాగే రైతుల సమస్యలని భారీ సభ పెడుతున్నారు.
ఇలా బాబు పోరుబాట పడితే..ఇప్పుడు పవన్ సైతం రంగంలోకి దిగారు. ఎప్పుడో జనసేన ఆవిర్భావ సభ సమయంలో కనిపించిన పవన్..మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రైతులకు అండగా నిలబడనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్నారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులను కలుసుకుని వివరాలను జనసేనాధిపతి తెలుసుకోనున్నారు. పలు నియోజక వర్గాల మీదుగా పర్యటన సాగనుంది. మొత్తానికి బాబు తర్వాత పవన్..జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.