తిరుపతి: రాయలసీమ వాసులు ఉపాధి కరువై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు రాయలసీమ పోరాట అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక కూలి పనులకు పొరుగు రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస పోతున్నారని అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు హైదరాబాద్ అపార్ట్మెంట్లలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ రాయలసీమకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఉద్యోగాలు లేకుండా రాయలసీమలో యూనివర్సిటీలు ఉండి ప్రయోజనం ఏమిటన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే పాలకులకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా రాజస్థాన్ ఏడాది ప్రాంతం కంటే ఎక్కువగా కరువుతో బాధపడుతోందన్నారు. వ్యవసాయ భూముల్లో నీటి సదుపాయం లేక ఒక్క శాతం కూడా వ్యవసాయానికి నోచుకోవడం లేదన్నారు. రాయలసీమ ఉద్యోగులకు ప్రమోషన్లలో వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు.