భక్తులకు అలర్ట్…విజయవాడలో ప్రోటోకాల్ దర్శనాలు రద్దు అయ్యాయి. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశామని దుర్గగుడి ఈవో రామారావు ప్రకటించారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో రామారావు మాట్లాడుతూ… వచ్చే నెల 6 నుంచి నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రి పై ఆషాఢ మాస సారె మహోత్సవం ఉంటుందన్నారు. భక్తులు అమ్మవారి కి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
వచ్చే నెల 19 తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఈ ఉత్సవాలు జులై 6 నుంచీ 15వరకు జరుగుతాయని చెప్పారు.
వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతామని… 14న తెలంగాణా మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు. ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది… మద్యాహ్నం మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారన్నారు. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామని… 11:45 నుంచీ 12:15 వరకూ మహా నివేదన ఉంటుందని తెలిపారు. 11:30 నుంచీ 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు అన్నారు.