బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినా జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కానీ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టరని విమర్శలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఆయన బయట అడుగు పెట్టకపోవడమే ప్రజలకు మంచిదని, జగన్ మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి కాలు బయటపెట్టారంటే, ఏపుగా ఎదిగిన వృక్షాలను నరికి వేయడం, చేతివృత్తుల వారు తమ ఉపాధిని కోల్పోవడం, వ్యాపారస్తులు ఆ రోజు తమ వ్యాపార కార్యకలాపాలను నష్టపోవడం, రోడ్లపై ప్రయాణికులు ఇబ్బందులు పడడం మినహా, మరో ప్రయోజనమేమీ ఉండదని అన్నారు.
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు సంభవించిన ప్రాంతానికి వెంటనే జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా తీరికగా వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విపత్తు వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో పర్యటిస్తే అధికారులంతా తన చుట్టూ చేరి, సహాయక చర్యలు చేపట్టారని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. సోమవారం మన్యం, పోలవరం ప్రాంతాలలో జగన్ మోహన్ రెడ్డి గారు పర్యటించనున్నారని, ఇటీవల వరదల వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారని, భోజనాలు లేవని ప్రజలు అడిగితే… బియ్యం, పుచ్చిపోయిన వంకాయలను ఇచ్చారట అని అన్నారు. వండుకొని తినలేని స్థితిలో ఉన్న ప్రజలకు బియ్యం, పుచ్చిపోయిన వంకాయలు ఇస్తే ప్రయోజనం ఏమిటి? అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.
ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యేందుకు జగన్ మోహన్ రెడ్డి గారు బయలుదేరారని, ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముందుగానే తర్ఫీదునిచ్చిన వారితో మాట్లాడించారని, వారంతా అనంత బాబు అపూర్వ సేవలు అందించారని, రెండువేల రూపాయలు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారని, ప్రభుత్వ సహాయం అందకపోతే అందించడానికి తాను వచ్చానని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారని తెలిపారు. అక్కడ సమావేశాన్ని చూస్తే డ్రామా కంపెనీని తలపించిందని, సమస్యలు చెప్పే వారిని ఇళ్లల్లో బంధించిన అధికారులు, ట్రైనింగ్ ఇచ్చిన వారినే సమావేశానికి అనుమతించడం పరిపాటిగా మారిందని అన్నారు.