ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత పాలకుల కంటే బ్రిటిష్ వారే ఎంతో నయమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అల్లూరి సీతారామరాజు గారిని అక్రమంగా కాల్చి చంపిన రూథర్ ఫోర్డ్ ను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితిని కల్పించారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో ఆయన్ని విచారించాలి అంటే తప్పనిసరిగా గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలని చట్టంలోని 17A నిబంధన స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.
అయినా పోలీసులు ఈ నిబంధనను కనీసం పాటించలేదని, దీని కోసమేనా తెల్లవారితో పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించుకుందని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యమును హత్య చేసి శవాన్ని పార్సిల్ చేశారని, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని నడిరోడ్డుపై చంపేశారని, తనను కూడా చంపాలని చూశారని, కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల త్రుటిలో తప్పించుకున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని కోరుతూ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో హైదరాబాద్లోని ఐటి హబ్ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందని అన్నారు.