టిడిపి, జనసేన పార్టీలకు 131 అసెంబ్లీ స్థానాలు – వైసీపీ ఎంపీ

-

సి ఓటర్ ఇండియా టుడే సర్వే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని, కర్ణాటకలోనూ సి ఓటర్ సర్వే అంచనాలు వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 15 పార్లమెంటు స్థానాలు గెలుస్తుందని సి ఓటర్ సర్వే అంచనా వేసిందని, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారనేది స్పష్టం అయిందని, దీన్నిబట్టి మరో అయిదు పార్లమెంట్ స్థానాలు టీడీపీ గెల్చుకోవడం ఖాయం అని తెలిపారు.

తమ పార్టీ వారిలాగా 175 కు 175 స్థానాలను గెలుస్తామని చెప్పను కానీ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 131పైగా అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందన్నారు. తన గత సర్వేలు, ప్రస్తుత సి ఓటర్ సర్వే ప్రాతిపదికన ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. ఐప్యాక్ సర్వే కూడా బయటకు వచ్చిన తర్వాత అధికార పార్టీ కేవలం నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేలిపోయిందని, ఐప్యాక్ సర్వేకు, సి ఓటర్ సర్వేకు పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు.

టైమ్స్ నౌ సర్వేను సాకుగా చూపెడుతూ బీజేపీ నాయకత్వాన్ని తమ పార్టీ నాయకులు మభ్య పెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారని, కానీ బీజేపీ వాళ్ళు తమ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిల్లో లేరని అన్నారు. సి ఓటర్ సర్వే అంచనాలను సాక్షి దినపత్రిక ప్రచురించలేదని, ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అంచనాలను ఏ దినపత్రిక కూడా రాసుకోదని అన్నారు. సి ఓటర్ సర్వే అంచనాలతో మబ్బులన్నీ తొలగిపోయాయని, రానున్నది ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వమేనని, దెబ్బతిన్న తెలుగు వారందరూ జయమ్ము నిశ్చయంబురా అని విజయ గీతం ఆలపించాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల విజయం తథ్యం అని, దోపిడీ వ్యవస్థ పరాజయం ఖాయం అని, ఈ ప్రభుత్వ ఆరాచకాలను ఇకనైనా ధైర్యంగా అడ్డుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version