దొంగ ఓట్లు నిర్మూలిస్తే వైసీపీ పార్టీ ఓటమి ఖాయం – రఘురామ

-

మన ఓట్లను మనం రక్షించుకుంటూ, దొంగ ఓట్లను నిర్మూలిస్తే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అవుటని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. దొంగ ఓట్లపై ఆధారపడే తమ పార్టీ నాయకులు విజయంపై ఒకింత నమ్మకాన్ని పెట్టుకున్నారని, దొంగ ఓట్ల నిర్మూలనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరూ అధికారులను సస్పెండ్ చేసిన శుభవార్త విన్నామని, రానున్న రోజుల్లో మరిన్ని ఇదే తరహా శుభవార్తలను వింటామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మార్గదర్శి సంస్థపై గత ఐదు రోజులుగా జగన్ మోహన్ రెడ్డి గారి దిశా నిర్దేశంతో కొనసాగుతున్న వేధింపు దాడులపై కోర్టు మధ్యంతర స్టే విధిస్తూ, రెండు రోజుల పాటు బ్రేక్ వేస్తూ మధ్యంతర స్టే ఇచ్చిన న్యాయస్థానం, రెండు రోజుల అనంతరం శాశ్వత స్టే ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. గతంలోనూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను వక్రీకరించి, చందాదారులను ఫిర్యాదు ఇవ్వమని ఒత్తిడి చేసి, పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, దొంగ ఫిర్యాదులు ఇవ్వమని చందాదారులపై అనేక ఒత్తిళ్లు చేసినప్పటికీ, పోలీసులు నమోదు చేసిన కేసులు న్యాయస్థానం ముందు నిలబడలేదని అన్నారు.

తాజాగా నమోదు చేసిన కేసులోనూ బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసి కస్టడీకి ఇవ్వాలని కోరారని, అయినా న్యాయస్థానం నిరాకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మరో మారు స్పష్టం అయ్యిందని అన్నారు. పోలీసు వ్యవస్థను ఈ పాలకులు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఒక రాజకీయ నాయకుడు చెప్పాడని, ఐపీఎస్ పాస్ అయిన అధికారులు కూడా తింగరి చేష్టలకు పాల్పడుతున్నందుకు సిగ్గుపడాలని, వీరు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యారో అర్థం కావడం లేదని అన్నారు. ఐపీఎస్ అధికారులు కూడా చట్టంలోని నిబంధనలు పాటించకపోవడం దుర్మార్గమని, ఇటువంటి వెధవ పనుల్లో పాలుపంచుకుంటున్నందుకు తమను చూసి తామే సదరు అధికారులు సిగ్గుపడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version