ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కన్నెత్తి కూడా చూడలేదని, ఆయన్ని కనీసం పట్టించుకోలేదని, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం తమ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అవకాశమే లేదని తాను గతంలోనే స్పష్టం చేశానని అన్నారు ఎంపీ రఘురామ. కాళ్ళా వేళ్లా పడితే జగన్ మోహన్ రెడ్డి గారికి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు.
అమిత్ షా గారితో అర్ధరాత్రి సమావేశమైన జగన్ మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి వివేక గారి హత్య కేసు అభియోగ పత్రంలో తన పేరును చేర్చిన సీబీఐపై ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని, అర్ధరాత్రి హోం శాఖామంత్రి గారితో సమావేశమై ప్రత్యేక హోదా, పోలవరం నిధులు అడిగామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, వినే వారికే విడ్డూరంగా ఉందని అన్నారు.
అదే విషయాన్ని పదే పదే చెప్పే వారికి సిగ్గు లేదా?, అయినా పోలవరం నిధులతో హోం శాఖకు సంబంధం ఏమిటి?, విభజన సమస్యలపై చర్చించామంటే ఓ అర్థం ఉంది… అమిత్ షా గారికి ఇతర పనులు ఏమీ లేవా?, కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిందే వింటూ కూర్చుంటారా? అని ఎద్దేవా చేశారు. వివేక గారి హత్య వెనక విస్తృత కుట్ర కుంభకోణం ఉందని సీబీఐ గతంలోనే పేర్కొందని, వివేక గారి హత్య గురించి జగన్ మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసునని సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసిందని, ఈ కేసులో ఒక రహస్య సాక్షి ఉన్నారని, ఆయన వివరాలను వెల్లడించలేమని హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసిందని అన్నారు.