జగనన్న విద్యా దీవెన కాదు… జగనన్న మృత్యు దీవెన అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ. మద్యాన్ని దశలవారీగా నియంత్రిస్తూ మధ్య నిషేధానికి చర్యలు తీసుకుంటామని జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చారని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు. మద్య నిషేధం అమలు గురించి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించిన వీడియోను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. దశల వారీగా మద్య నియంత్రణ చేస్తూ, మద్య నిషేధానికి కృషి చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు… ఇప్పుడు ఆదాయాన్ని ఇబ్బడి, ముబ్బడిగా పెంచుకుంటూ, భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
నాసిరకమైన మద్యాన్ని సేవిస్తూ ప్రజలు మృత్య వాత పడుతున్నారని దానికి జగనన్న మృత్యు దీవెన అని పేరు పెడితే బాగుంటుందని అన్నారు. విద్యా దీవెన కాస్త విద్యా వంచనగా మారిందని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి డబ్బులే చెల్లించడం లేదని, సీపీఎస్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పి, చేసింది లేదని, ఎస్సీ ఎస్టీలకు మేలు చేసే 29 పథకాలను జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసిందని, విదేశీ విద్యకు నిధులే ఇవ్వడం లేదని, ఇప్పుడు ఎన్నో షరతులను విధిస్తూ ఆ పధకానికి అంబేద్కర్ గారిని పేరును ఎత్తివేసి జగనన్న విదేశీ విద్యగా మార్చడం దారుణం అని అన్నారు. సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తానని చెప్పిన పైలెట్ ను కాకుండా, ఉచితంగా విమానం ప్రయాణం కల్పిస్తానని చెప్పిన పైలెట్ ను నమ్మడం వల్ల చివరకు ఆ విమానం ప్రమాదానికి గురైందని ఈ సందర్భంగా మరొక వీడియో సందేశాన్ని రఘురామకృష్ణ రాజు ప్రదర్శించి వివరించారు.