కార్పొరేషన్ల పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి శిక్షార్హుడని, ఆయనకు పదేళ్లపాటు జైలు శిక్ష వేయాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. కానీ వేయడం లేదని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దేశంలోనే అత్యంత పెద్ద మోసమని, స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని యదేచ్చగా ఉల్లంఘించిన ఘనత ఆర్థిక ఆక్రమణదారుడైన జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చురకలు అంటించారు.
రాజ్యాంగంలోని 266/1, 293/3 అధికరణలను అతిక్రమించి, రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మగువల భర్తల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని, మహిళల పుస్తెలతాడులను ఒక విధంగా ఆయన చోరీ చేస్తున్నాడని చెప్పాలని, రానున్న 13 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులను చేసిందని అన్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని ఇప్పుడే అప్పు చేసి ఖర్చు చేస్తే, రాబోయే తరాల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఇలాంటి చెత్త నాయకులు రాజకీయాల్లోకి వస్తారని గ్రహించే కాబోలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రాజ్యాంగంలో 266/1, 293/3 అధికరణాలను పొందుపరిచారని, అయినా జగన్ మోహన్ రెడ్డి గారు తూ నా బొడ్డు అన్నట్లు, ఆ అధికరణలను ఎత్తి అవతల పడేస్తున్నారని పేర్కొన్నారు.