విజయసాయి,పురందేశ్వరి వివాదంపై వైసీపీ ఎంపీ సంచలనం

-

జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సహా నిందితుడైన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి గారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక లేఖ రాశారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. వీరిపై నమోదైన ఐపిసి కేసులను, క్విడ్ ప్రోకో కేసులను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారని, విశాఖపట్నంలో తన కూతురి పేరిట విజయసాయిరెడ్డి గారు కూడబెట్టిన ఆస్తులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన సమీప బంధువు పాత్ర, దసపల్లా భూముల కబ్జా బాగోతం, ఓ రిసార్ట్ ను స్వాధీనం చేసుకొని 33 ఏళ్ల పాటు ఉన్న లీజును 99 ఏళ్లకు పొడిగించిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారని తెలిపారు.

వై.యస్. వివేకానంద రెడ్డి గారు తన సమీప బంధువుల చేతిలో హత్యకు గురి అయితే, విజయసాయిరెడ్డి గారు ప్రజల దృష్టిని మరల్చడానికి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చేశారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని గత పదేళ్లుగా బెయిల్ పై బయటనే ఉన్నారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారు, విజయ సాయి రెడ్డి గార్ల బెయిల్ రద్దు చేయడం కుదరకపోతే, వారిపై మోపిన కేసుల విచారణను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని పురందేశ్వరి గారు కోరారని, కేసుల విచారణ పూర్తి అయితే వారే జైలుకు వెళతారనేది పురందేశ్వరి గారి అభిప్రాయం కాబోలని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం స్పందించి, కేసుల విచారణ ఎందుకింత ఆలస్యం అయ్యిందని సీబీఐతో పాటు, జగన్ మోహన్ రెడ్డి గారికి మరో 14 మందికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఈ కేసును జనవరికి కోర్టు వాయిదా వేసిందని, కేంద్ర మాజీ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి గారు రాసిన లేఖపై సుప్రీంకోర్టు త్వరలోనే సమాధానం ఇస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణ రాజు గారు వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version