వైసీపీ ఎంపీ, ప్రధాన కార్యదర్వి విజయసాయిరెడ్డి దూకుడు మామూలుగా లేదని అంటున్నారు విశాఖ వైసీపీ నాయకులు. వాస్తవానికి ఎవరైనా. ఎక్కడైనా ప్రత్యర్థులపై పైచేయిసాధించాలని భావిస్తారు. ఆరకం గానే అడుగులు వేస్తారు. కానీ, సాయిరెడ్డి మాత్రం తన పార్టీ నేతలపైనే పైచేయి సాధించడంతో పాటు.. అందరినీ తన చెప్పుచేతల్లోనే ఉంచుకోవాలని చూడడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకు మంత్రి అవంతి శ్రీనివాసరావు.. బాధితుడిగా ప్రచారం జరిగింది. ఆయనకు స్వతంత్రం లేదని.. మంత్రి పేరుకే ఉన్నారని .. ఆయన ఏం చెప్పినా.. ఎవరూ వినిపించుకోవడం లేదని వార్తలు వచ్చాయి.
అదే సమయంలో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావును తీసుకువచ్చే వ్యవహారంలో అవంతి వద్దని వారించినా.. సాయిరెడ్డి దూకుడు ప్రదర్శించారని కూడా విమర్శలు వచ్చాయి. దీంతో అవంతి వర్సెస్ సాయిరెడ్డి మధ్య వివాదం నడిచింది. ఇక, ఇప్పుడు విశాఖ ఎంపీకి-సాయిరెడ్డికి కూడా పడడం లేదని తెలుస్తోంది. సాయిరెడ్డి పాల్గొంటున్న కార్యక్రమాలకు ఎంపీ హాజరుకావడం లేదని అంటున్నారు వైసీపీ నాయకులు. సాయిరెడ్డి కూడా ఎంపీకి తెలియకుండానే జిల్లాలో పర్యటించి పనులు చక్కబెడుతున్నారని తెలుస్తోంది. దీంతో వివాదం నానాటికీ ముదురుతోంది.
ఇంతకీ వీరి మధ్య తేడా ఎక్కడ వచ్చిందని ఆరాతీస్తే.. కీలకమైన విశాఖలోని సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి విచారణ చేసేందుకు కమిటీని వేశారు. దీనిలో ముందుగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేరును రాశారు. అయితే, సాయిరెడ్డి ఎంట్రీతో ఆయన పేరు తొలగించారు. కానీ, పేరు తొలగించిన విషయం ఎంపీకి కూడా తెలియనివ్వకుండా.. చివరాఖరుకు కమిటీ సమావేశం నిర్వహించేసి.. మీడియాకు సమాచారం ఇచ్చారు.
దీంతో కమిటీలో నేను కూడా ఉన్నాను కదా? నాకు తెలియకుండానే కమిటీ ఎప్పుడు సమావేశమైందని అధికారులను అడగ్గా.. తీరిగ్గా .. అప్పుడు పేరు తొలగించిన విషయాన్ని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఘనకార్యం వెనుక సాయిరెడ్డి ఉన్నారని తెలుసుకున్న ఎంపీ. అప్పటి నుంచి డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ తోడయ్యారు. మొత్తానికి విజయసాయి నిర్వాకంతో విశాఖ పార్టీ భ్రష్టు పట్టే పరిస్థితి ఉందని అంటున్నారు పరిశీలకులు.