ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న దేవస్థానం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్త ప్రసాదాలను తీసుకుంటారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా శ్రీశైలం బ్రమరాంభ, మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తుల సందర్శనతో రద్దీగా ఉంటుంది. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తుంటారు.
అయితే జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం.. ఆలయంలోని నంది విగ్రహానికి ఉన్న చరిత్ర, పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందున ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులలో ఈ పుణ్య క్షేత్రానికి చోటు లభించింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ అల్లాజీ ఎలియజర్ పత్రాన్ని అందజేశారు. గతంలో ఈ దేవస్తానం 7 విభాగాలకు ISO ద్వారా ధృవీకరణ పత్రం అందుకుంది.