టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా రాజమహేంద్రవరం కాారాగారంలోనే ఉన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఓవైపు టీడీపీ నేతలు.. మరోవైపు నారా, నందమూరి కుటుంబాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యాత్ర ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు భువనేశ్వరి వెళ్లనున్నారు. బాధిత కుటుంబీకులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. వారానికి మూడు రోజులపాటు జరగనున్న యాత్రలో స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భువనేశ్వరి తిరుపతికి చేరుకుని మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని అత్తవారింటికి చేరుకున్నారు. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమలకు వెళ్లానని, ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ఎప్పుడూ కుటుంబసభ్యులతో ఊరు వచ్చే తాను ఆయన జైల్లో ఉన్నందున ఈ రోజు ఒంటరిగా నారావారిపల్లికి వెళ్లానని.. ప్రతి నిమిషం భారంగా గడిచిందంటూ రాసుకొచ్చారు.