రెండు నెలల నుంచి కనిపించకుండాపోయిన చైనా రక్షణ మంత్రి లీషాంగ్పును జిన్‌పింగ్ సర్కార్ తొలగించింది. ఈ మేరకు అధికార మీడియా ఓ కథనం ప్రచురించింది. చైనా విదేశాంగశాఖ మాజీ మంత్రి ఖ్విన్‌గాంగ్ తర్వాత ఈ ఏడాది అదృశ్యమైన రెండో సీనియర్ అధికారి లీషాంగ్పు. ఎలాంటి వివరణ లేకుండానే విదేశాంగ మంత్రి ఖ్విన్‌గాంగ్‌ను మార్చిలో అధ్యక్షుడు జిన్‌పింగ్ కేబినెట్ నుంచి తప్పించారు.
మార్చిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత రక్షణ మంత్రిగా పగ్గాలు చేపట్టిన లీ షాంగ్పు.. ఆగస్టు 29న అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న తర్వాత ఆయన కనిపించకుండాపోయారు. ఖ్విన్ గాంగ్, లీ షాంగ్పుల అదృశ్యం చైనా విదేశాంగ, రక్షణ విధానం మారిందని చెప్పటానికి ఎలాంటి సంకేతాలు లేనందున జిన్‌పింగ్ నాయకత్వాన్ని ప్రశ్నించటం వల్లనే వారికీ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.
విధేయతకు ప్రాధాన్యం ఇచ్చే జిన్‌పింగ్.. అవినీతిని ఏమాత్రం సహించరనే అభిప్రాయం ఉంది. కొన్నిసార్లు తన ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు, చైనా ఆర్థికవ్యవస్థ క్షీణిస్తున్న నేపథ్యంలో.. తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు, అమెరికాతో వాణిజ్య, సాంకేతిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తుంటారనే ప్రచారం జరుగుతోంది.