వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పలు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పోరు తీవ్రమైన విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, కొందరు వైసీపీ నేతలకు అసలు పొసగడం లేదు. ఇక ఈ ఆధిపత్య పోరుకు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పెట్టింది పేరులా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్‌కు, ఇన్‌చార్జ్‌గా ఫైర్‌బ్రాండ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు అసలు పడటం లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేని సైతం డామినేషన్ చేసేలా సిద్ధార్థ్ రాజకీయాలు ఉంటున్నాయి. దీంతో ఎమ్మెల్యే వర్గం బాగా గుర్రుగా ఉంటుంది.
పైగా జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు సైతం బైరెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కొద్ది రోజులుగా ఆర్థర్ సైతం గుస్సాతో ఉన్నారు. నియోజకవర్గంలో పదవుల విషయంలో బైరెడ్డి వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఫైర్ అవుతూ వస్తోంది. ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సీట్లు పంపకాల్లో కూడా బైరెడ్డి వర్గం హవానే నడిచింది. దీంతో ఎమ్మెల్యే వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉండిపోయింది.
అయితే తాజాగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా బైరెడ్డి వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. పదవుల పంపకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు వైసీపీ పెద్దలు తనని సంప్రదించకుండా, బైరెడ్డి ప్రాధాన్యమిచ్చారంటూ ఎమ్మెల్యే ఆర్థర్, సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే తన నియోజకవర్గంలో అగ్రవర్ణాల నేతల పెత్తనం ఎక్కువైపోయిందని, అలాగే కొందరు వైసీపీ పెద్దలు సైతం వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎంతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక సీఎం కూడా ఈ విషయంలో కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఫిర్యాదు తీసుకుని నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనానికి చెక్ పెట్టాలని సీఎం యోచిస్తున్నారని సమాచారం. అందుకే కొద్ది రోజుల క్రిందట వరకు ఎక్కడ చూసినా బైరెడ్డి పేరే వినిపించేది. ఇప్పుడు ఆయనకు పదవులు రాకపోవడానికి కూడా జగన్ బైరెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉండడమే కారణమంటున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో నందికొట్కూరు రాజకీయం ఎలా …ఉండబోతుందో…?