టీడీపీలో ఇటీవల జరిగిన ప్రక్షాళన నేపథ్యంలో చాలా మంది పెద్ద, చిన్న నేతలు పదవులు సంపాయించు కున్నారు. అనేక మంది ఆశ పెట్టుకున్నా.. పదవులు దక్కలేదు. దీంతో వీరు నిరాశ చెందుతున్నా.. మరోవైపు పదవులు దక్కించుకున్నవారిపై సటైర్లు పేలుస్తున్నారు. “అన్నా.. పదవి వచ్చిందా.. బాగా.. పనిచేయ్! “ అంటూ.. ఎత్తి పొడుస్తున్నారు. మరికొందరు.. “మీకు చక్కటి బాధ్యత అప్పగించారు. ఇంకేముంది.. వచ్చే ప్రభుత్వంలో మీరు మంత్రి అయినా అవ్వొచ్చు!“ అని నిట్టూరుస్తున్నారు.
ఈ తరహా వ్యవహారాలు ఏ ఒక్క జిల్లాలోనో .. నియోజకవర్గంలోనో.. పరిమితం కాలేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిపిస్తోంది. ఎందుకు ఇలా అంటున్నారనే విషయం ఆరాతీస్తే.. కొందరు చెప్పిన మాటలను బట్టి.. ప్రస్తుతం పార్టీ పుంజుకునే పరిస్థితిలో లేదు. వాస్తవానికి కమిటీలు వేసేందుకు మరో ఏడాది గడువు ఉంది. అయినా.. ఇప్పుడే వీరికి బాధ్యతలు అప్పగించారంటే.. ఎన్నికలకు ముందు ఏడాది వరకు పరిస్థితిని చూసి.. అవసరమైతే.. రెండేళ్లు గడిచిపోయాయి కాబట్టి.. అంటూ.. వీరిని తప్పించేసినా తప్పించేయొచ్చు! అనే విషయాన్ని చెబుతున్నారు.
మరికొందరు .. గత సర్కారు హయాంలో చేసిన పాపాలను కడిగే బాధ్యతలను అప్పగించారు. పదవులు అంటే.. ఇంకేముంటుంది. పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే.. ఎక్కడికెళ్లినా.. గత పాలన గురించే ప్రశ్నలు వస్తున్నాయి. మరి వాటిని కడగాలంటే.. ఒకరు ఇద్దరూ సరిపోరు కాబట్టి ఇంతమందికి బాధ్యతలు అప్పగించినట్టున్నారు! అని మొహం మీదే అనేస్తున్నారు.
అంటే.. ప్రస్తుతం పదవులు పొందిన వారిలో ఎక్కడా కూడా సంతోషం కనిపించకపోవడాన్ని బట్టి.. వీరు చెబుతున్నది వాస్తవేనని అనిపిస్తుండడం గమనార్హం. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో టీడీపీలో పదవులు వచ్చిన వాళ్ల కంటే పదవులు రాని వారే చాలా లక్కీ అని… వారే అదృష్టవంతులు అని పార్టీ కేడరే చర్చించుకుంటోన్న పరిస్థితి. దీనిని బట్టి పార్టీ పుంజుకుంటుందన్న విషయంలో వాళ్లకే నమ్మకం లేదని అర్థమవుతోంది. మొత్తానికి చంద్రబాబు ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.
-vuyyuru subhash