పవన్ కళ్యాణ్ కు విజయసాయిరెడ్డి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ అందరికీ ఆదర్శమని.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిన ఆంధ్రా కొత్త వ్యవస్థలు అంటూ పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నుంచి సహాయం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సేవలను ప్రజలకు అందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల గురించి జనం ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను మధ్యదళారుల అవసరం, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ వలంటీర్లు చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సామాన్య ప్రజానీకానికి ఈ వలంటీర్ల వ్యవస్థ ఎనలేని మేలు చేస్తోందన్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదభిప్రాయం బలపడుతోందని వివరించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవవేతనం) కింద ఏటా రూ.1200 కోట్లు చెల్లిస్తున్నారన్నారు. కనీస విద్యార్హతలతో, పారితోషికంతో పనిచేసే వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే 2019 ఆగస్టు 15న ప్రవేశపెట్టింది. కొత్త వ్యవస్థకు వచ్చే నెల 15న నాలుగేళ్లు నిండుతాయని చెప్పారు.