సెలబ్రిటీల అనారోగ్యాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. హఠాత్తుగా ఓ సెలిబ్రిటీ తాను ఫలానా వ్యాధితో బాధపడుతున్నానని, అభిమానుల ఆశీస్సులతో త్వరలో కోలుకుంటానని సోషల్ మీడియా ద్వారా చెప్పడం నేడు సాధారణ విషయంగా మారిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు లేని రోజుల్లో కూడా ప్రసిద్ధ హాలీవుడ్ నటులు లేదా ప్రముఖ క్రీడాకారులు తమ తీవ్ర ఆరోగ్య సమస్యల గురించి ప్రకటనల ద్వారా ప్రజానీకానికి వెల్లడించడం తెలిసిన విషయమేనన్నారు.
సినీ, క్రీడా, వినోద రంగాల్లోని వారు ఇంకా రాజకీయాల్లో ఉన్నవారు తమను తీవ్ర అనారోగ్యం పీడిస్తోందని తెలిసిన వెంటనే ఆ విషయం వెల్లడిస్తున్నారు. సున్నితమైన ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని దాచిపెడితే..విషయం దాగదు సరికదా–అనేక పుకార్లకు దారితీస్తుంది. పాశ్చాత్య ప్రపంచంలో, భారతదేశంలో కోట్లాది ప్రజలకు తెలిసిన సెలిబ్రిటీలు తమకు ప్రాణాంతక జబ్బు వచ్చిందని వైద్యులు పరీక్షించి చెప్పగానే సోషల్ మీడియా ద్వారా ఆ సంగతి ప్రజలకు చేరవేయడం ఈమధ్య మరీ ఎక్కువైందని తెలిపారు. దీని వల్ల ప్రజాజీవితంలో దాపరికం లేకుండా బతకడానికి వీలవుతుంది. తాము ఎల్లప్పుడూ చల్లగా, ఆనందంగా జీవించాలని కోరుకునే అభిమానులకు, ప్రజలకు తెలియకుండా ఎలాంటి ‘ఆరోగ్య రహస్యాలు’ దాచుకోకోడదనే సూత్రం నేడు ఆధునిక ప్రపంచంలో ప్రముఖులను నడిపిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.