రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారంపై స్పందించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంతో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి రాజీనామా దురదృష్టకరం అన్నారు.
విజయసాయిరెడ్డి పార్టీకి, పార్లమెంట్ లోను వెన్నెముక లాంటి వారని అభివర్ణించారు. అయితే ఆయన ఏ పరిస్థితులలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలియదన్నారు. మా పార్టీ సభ్యుడిని మళ్లీ రాజ్యసభకు ఎంపిక చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయసాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారని.. రేయింబవళ్లు కష్టపడి పని చేశారని తెలిపారు.
ఆయన లేని లోటు తీవ్రమైందన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. అధికారం కోల్పోయాక పార్టీ నుండి వెళ్లడం, అధికారంలోకి వచ్చాక తిరిగి రావడం కామన్ అని.. కానీ ఆ జాబితాలో విజయసాయిరెడ్డి ని చూడలేమన్నారు. ఏది ఏమైనా తాను పొరపాటున కూడా పార్టీ మారనని స్పష్టం చేశారు పిల్లి సుభాష్. వైయస్సార్సీపీలోనే ఉంటానని తెలిపారు.