జగన్ పాలనపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు ఎన్నికలు జరగడానికి 9 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతిపథంలో ఉరకలు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన కృషి అన్ని రంగాల్లో సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు.
సాధారణంగా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా ఏ రాష్ట్రంలోని పాలకపక్షమైనా విజయాలు, వైఫల్యాలు బేరీజు వేసుకుంటూ ఆందోళనతో ముందుకు నడుస్తుంది. అయితే, ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో, విజయోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 98.5 శాతం నెరవేర్చామని మూడున్నర నెలల క్రితం సీఎం గారు చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం అని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అన్ని రంగాల్లో ప్రభుత్వం తెచ్చిన మార్పుల ఫలితంగా ఏపీ 11.23 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు రూ.1,97,473 కోట్ల సొమ్ము అందజేసి ఈ ఏడాది బడ్జెట్ నాటికి ఏపీ సర్కారు నగదు బదిలీలో కొత్త రికార్డు సృష్టించింది. క్షేత్రస్థాయిలో ఐదున్నర కోట్ల ఆంధ్రులకు మేలు జరిగేలా 13 జిల్లాలను 26కు, 51 రెవెన్యూ డివిజన్లను 76కు పెంచింది. అలాగే టీడీపీ హయాంలో వైద్యకళాశాలలు 11 ఉండగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి సమంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు.