ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా ఉంటామని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మొదట తెలుగులో ఉపన్యాసాన్ని ప్రారంభించారు. “ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. మీపై అభిమానాన్ని చూపించే అవకాశం నాకు ఇప్పుడు లభించింది” అని ప్రధాని మోదీ తెలుగులో చెప్పుకొచ్చారు.
దీంతో వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రుల పెదవులపై నవ్వులు విరిశాయి. అలాగే ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని మోదీ చెప్పుకొచ్చారు. సింహాచలం వరాహ నరసింహస్వామి కి నమస్కారం అంటూ తన స్పీచ్ ని మోడీ కొనసాగించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ లక్ష్యం అని, రాష్ట్ర ప్రజల సేవే తమ సంకల్పమని తెలిపారు మోది. సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.