ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వస్తున్న వార్తలపై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. గతంలో 151 అసెంబ్లీ , 21 ఎంపీ స్థానాలను సాధించిన వైసీపీ నేడు 11 అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
అసెంబ్లీలో కూటమి బలం 164 ఉండగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు చేసేదేమి లేదని జగన్ బహిరంగంగానే ప్రకటించారు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడం జగన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఒక దశలో తాను హిమాలయాలకు వెళ్లాలని భావించినట్లు కూడా ఆయన తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వరన్న అనుమానంతో వైఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంట్‌కు వెళ్తున్నట్లు కొన్నిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. జగన్ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.