రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివే. ఒకరిపై పైచేయి సాధించేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. పైకి మాత్రం అవకాశాలు.. అవసరాలు.. అనే వ్యూహాలతో ముందుకు సాగుతారు. ప్రస్తుతం పరిస్థితిలో మిత్రపక్షాలు కూడా తమ తమ రాజకీయ అవసరాల కోసం విభేదిస్తున్న రోజులు మనం చూస్తున్నాం. అయితే, అటు మిత్ర పక్షం కాదు.. కానీ, వైసీపీతో.. బీజేపీ.. బీజేపీతో వైసీపీ సన్నిహితంగానే ఉంటున్నాయి. పోనీ.. దానిని ఒప్పుకొంటారా ? అంటే.. ఛస్! కాదనే అంటారు. మాకు బద్ధ శత్రువు వైసీపీ అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. బీజేపీని పట్టించుకునే అవసరమే లేదని.. దానికి కనీసం నోటాకు వచ్చిన వోట్లు కూడా గత ఎన్నికల్లో రాలేదని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తారు.
కానీ, ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడో దండలో దారం మాదిరిగా సంబంధం ఉందనేది వాస్తవమేనని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఏపీకి పెద్దగా సహకరిస్తున్నట్టు పైకి కనిపించక పోయినా.. అంతో ఇంతో సహకారం మాత్రం అందిస్తోంది. ఇటీవల పోలవరం నిధులు ఇచ్చింది. మూడు రాజధానులు ఉంటే తప్పేంలేదని ఏకంగా కేంద్రం హోం శాఖ ఏపీ హైకోర్టుకే స్పష్టం చేసింది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ప్రత్యక్షంగానే కేంద్రానికి సహకరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ పెద్దలు కోరడంతో రాజ్యసభ సీటునే జగన్ త్యాగం చేశారు. ఇక, కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన వ్యవసాయ బిల్లుకు ఓకే చెప్పారు.
ఇలా పరస్పరం ఎక్కడా బయటకు చెప్పుకోకుండానే సహకరించుకుంటున్నారు. అయితే, తాజాగా జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో 40 నిముషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏం చర్చించారనే విషయం వెల్లడికాకపోయినా.. కొందరు మాత్రం కొన్ని రాజకీయ లీకులు ఇచ్చారు. `నేను మీకు ఏం కావాలంటే అది చేస్తున్నాను. మీరు మాత్రం నాకు సహకరించడం లేదు“ అని జగన్ .. ప్రధానితో అన్నట్టు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు, హోదా ఇవ్వాల్సిందేనని, పోలవరాన్ని వచ్చే ఏడాది పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని.. కాబట్టి 15 వేల కోట్లు ఇవ్వాలని.. జగన్ షరతులు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక, మోడీ సైడ్ కూడా.. ఏపీలో బీజేపీ ఎదుగుదలకు అడ్డు పడొద్దని, బీజేపీ నేతలపై విమర్శలు చేయొద్దని కూడా షరతులు విధించారని ప్రచారంలోకి వచ్చింది. మరి ఇవి ఎంత మేరకు నిజాలు? ఎంత సాన్నిహిత్యం ఉన్నా.. ఇంతలా ఒకరిపై ఒకరు షరతులు విధించుకునే పరిస్థితి ఉందా ? అనేది ప్రశ్న. ఇప్పటి వరకు ఉన్న సాన్నిహిత్యాన్ని చూస్తే.. అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. ఇక జగన్ అంటే గిట్టని మీడియా మాత్రం జగన్కు మోడీ సుత్తిమెత్తని హెచ్చరికలు చేశారని చెపుతోంది. కానీ, కొందరు కావాలనే ఈ భేటీకి ఇంత హైప్ తెస్తున్నారని చెబుతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో ? చూడాలి.
-vuyyuru subhash