ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రతినిధి అసెంబ్లీ సమావేశాల గురించి ప్రశ్నించగా.. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించిందని తెలిపారు జగన్. మైకు ఇవ్వనిది అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఏమి చేయాలన్నారు. ప్రతీ మూడు రోజులకొకసారి మీడియా ద్వారా సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తానని జగన్ ప్రకటించారు.
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేము కాకుండా ప్రతిపక్షం లేనప్పుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరారు జగన్. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు. 40 శాతం ఓట్లు వచ్చిన వారిని గుర్తించరా..? అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే.. సభలో మైకు ఇవ్వాలి. సభా పక్ష నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి మైకు ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమస్యలు చెప్పనీయకుండా ఉండటానికే ప్రతిపక్ష పార్టీని గుర్తించడం లేదన్నారు జగన్.