తిరుమల శ్రీవారి ప్రసాదం, లడ్డు వివాదం రెండు, మూడు రోజుల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య దీనిపై వివాదం జరుగుతోంది. ఎవ్వరికీ తోచిన వారు స్పందిస్తున్నారు. అసలు వాస్తవం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. అధికార టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మాత్రం తిరుమల లడ్డూ, ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపల నూనె కలిసినట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వల్లనే లడ్డూ, ప్రసాదం వివాదం తలెత్తిందని పేర్కొంటున్నారు. వైసీపీ నాయకులు మాత్రం అలాంటిది ఏం లేదు. శ్రీవేంకటేశ్వరుడి పాదాల వద్ద ప్రమాణం చేయడానికైనా సిద్ధమే అని పేర్కొంటున్నారు. ప్రధానంగా తిరుమల లడ్డూ ప్రసాదం పై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే బుధవారం విచారణ చేపడుతామని ఏపీ హై కోర్టు పేర్కొంది. ముఖ్యంగా ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని న్యాయవాది కోరారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు.