రాజకీయాల్లో బెస్ట్ టైమింగ్ ఉంటే.. నేతలకు తిరుగే ఉండదు. అలాంటి టైమింగ్ అందరికీ సాధ్యమేనా? అంటే.. అధికారంలో ఉన్న వారు తలుచుకుంటే.. సాధ్యమే. గతంలో చంద్రబాబు పాలనలోనూ వ్యూహం.. అదిరిపోయేలా అభివృద్ధి అంటూ.. ఏవేవో గ్రాఫిక్కు లు చూపించినా.. ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. అధికారంలో ఉన్న జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తొలి ఏడాదిలోనే తాను చెప్పిన సంక్షేమ కార్యక్రమాలను అమలులో పెట్టేశా రు. ఇక, ఇప్పుడు రెండో ఏడాది ప్రారంభమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల నుంచి అభివృద్ది ఎక్కడ? డబ్బులు పందేరం చేస్తున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి విమర్శలకు చెక్ పెడుతూ.. జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రెండో ఏడాదిని సంపూర్ణంగా అభివృద్ధి కార్యక్రమాలకే కేటాయించారు. అంతేకాదు, ఏకకాలంలో చక్కటి టైమింగ్‌తో దూసుకు పోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకే దఫా ఏడు జిల్లాలపై తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు మూడు, రాయలసీమ జిల్లాలు నాలుగు మొత్తం ఏడు జిల్లాలపైనా జగన్ తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రాజధాని ఏర్పాటు, రెండు భోగాపురం విమానాశ్రయం, మూడు.. గిరిజన విశ్వవిద్యాలయం సహా పారిశ్రామికంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, సీమ విషయానికి వస్తే.. కడప ఉక్కు పరిశ్రమను పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం స్వ యంగా రూ.500 కోట్లను ప్రాథమిక పెట్టుబడిగా పెట్టనుంది. అదేసమయంలో కొన్ని దశాబ్దాలుగా ముడిపడని పోతిరెడ్డి పాడు హె డ్ రెగ్యులేటర్ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో వలసలకు కేంద్రంగా ఉన్న అనంతపురం, కడప జిల్లాల్లో వలస కార్మికులకు స్థానికంగా పనులు కల్పించేలా పారిశ్రామికీకరణకు ఇప్పటికే అనంతపురంలో ఉన్న కియాను మరింత బలోపేతం చేసేలా చర్చలు జరిపి సాధించారు. ఆయా పనులు అన్నీ కూడా ఈ ఏడాదిలోనే కార్యరూపం దాల్చనున్నాయి. దీంతో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలపై జగన్ తనదైన శైలిలో ఏకకాలంలో ముద్ర వేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.