అసలే అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మండిపడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గారు మళ్లీ రెచ్చిపోతారా? ఆయన దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ఇప్పటికే ఆయన మండి పడుతున్న తణుకు ఎమ్మెల్యే కారూమూరి నాగేశ్వరరావు.. మళ్లీ రెచ్చిపోయారు. అతనొక తేడా అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఎంపీని తాము మనిషిలా గుర్తించడం లేదన్నారు. రఘురామ కృష్ణంరాజు బీజేపీకి వెళ్లిపోతున్నారు కనుకనే మోదీ భజన చేస్తున్నారన్నారు.
దీంతో మళ్లీ వైసీపీలో కలకలం రేగింది. ఇప్పటికే ఎంపీ రఘు.. పార్టీపైనా.. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే లపై నా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ఉనికినే ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఒక్క సారిగా ఆయనను తేడా.. అంటూ వ్యాఖ్యానించడం మరింత వివాదానికి కారణంగా కనిపిస్తోంది. ఎంపీ రఘు.. సీఎం జగన్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో మిగిలిన నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా రు.. వారికి షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతేకాదు.. తన ఒక్కడికే ఎందుకు నోటీసులు ఇచ్చారు.. అంటూ ప్రశ్నించారు.
ఈ పరిణామాలతో మొత్తంగా పార్టీని పశ్చిమ నేతలు రోడ్డున పడేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుత వివాదాన్ని చల్లార్చేందుకు లేదా ఎంపీని కట్టడి చేసేందుకు వైసీపీ అధినాయకత్వం తీవ్రంగా పనిచేస్తోంది. అదేసమయంలో ఆయనను ఉంచాలా పంపేయాలా? అనే దానిపైనా చర్చిస్తోంది. ఇక, జిల్లా రాజకీయాలను కూడా లైన్‌లో పెట్టాలని నిర్ణయించుకుని ఆదిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కారుమూరి వ్యాఖ్యలు సర్వత్రా వివాదాన్ని మరింత రాజేస్తాయని అంటున్నారు. దీంతో రాజుగారు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.