ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటామన్న సంగతి తెలిసిందే. అయితే గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే కాకుండా అలాంటి పలు ఇతర స్టోర్స్ కూడా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. అవి యాప్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోనూ గూగుల్ ప్లే స్టోర్‌లాగే అనేక యాప్స్ ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాంటి స్టోర్ యాప్‌లలో ఏపీకే ప్యూర్ అనే యాప్ కూడా ఒకటి. అయితే ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వారు దీన్ని వెంటనే ఫోన్ నుంచి తీసేయాలని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీకే ప్యూర్ యాప్ ద్వారా ఫోన్లకు మాల్‌వేర్‌లు వ్యాప్తి చెందుతున్నాయని సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ల్యాబ్ వెల్లడించింది. ఈ యాప్‌ను వాడితే ఫోన్లకు మాల్‌వేర్ వస్తుందని, దీంతో ఫోన్‌లో ఉండే యూజర్ల డేటా చోరీ అవుతుందని, హ్యాకర్లు ఆ డేటాను తస్కరిస్తారని, అలాగే యూజర్ల ఫోన్లలో అవాంఛిత యాడ్స్ డిస్‌ప్లే అవుతాయని కాస్పర్‌స్కై వెల్లడించింది. అందువల్ల ఈ యాప్‌ను వెంటనే తొలగించాలని సూచించింది.
అయితే ఏపీకే ప్యూర్ డెవలపర్లు మాత్రం తమ యాప్‌లో లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ వాటిని పరిష్కరించామని, అందువల్ల ఇప్పుడు యూజర్లు ఎప్పటిలాగే ఫోన్‌లలో తమ యాప్‌ను వాడవచ్చని తెలిపింది. కానీ గూగుల్ ప్లే స్టోర్‌కు బదులుగా అలాంటి థర్డ్ పార్టీ స్టోర్ యాప్స్‌ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.