టీడీపీ సీనియర్ నేత,పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra)పై మరో కేసు నమోదైంది. కరోనా నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో ధూళిపాళ్లపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలను విరుద్ధంగా ధూళిపాళ్ల ఓ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
మే 29న నోవాటెల్ హోటల్‌లో 20మందితో కలిసి సమావేశం ఏర్పాటు చేసారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. సమావేశానికి హాజరైన వారు హోటల్ లాబీలో భోజనం అనంతరం సమావేశం నిర్వహించారని అందులో వివరించారు. దీంతో ఆయనపై 188, 269, 270 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లతో పాటు ఎపిడమిక్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
కాగా సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను ఏప్రిల్ 23న అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. అయితే రెండు వారాల క్రితం ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా ధూళిపాళ్ల నరేంద్రపై వరుస కేసులు నమోదవడం పట్ల టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని వారు ఆరోపిస్తున్నారు .