అమరావతి కోసం మరో రైతు బలయ్యాడు. నిన్నటి వరకూ ఉద్యమంలో పాల్గొన్న అన్నదాత గుండెపోటుతో నేలకొరిగాడు. అమరావతి రాజధాని ఉద్యమం 220 రోజులకు పైగా సాగుతోంది. ఆశల రాజధాని కోసం భూములిచ్చిన రైతులు… కొత్త రాజధాని ప్రతిపాదనతో తీరని శోకానికి గురయ్యారు. ఉద్యమంలో పాల్గొని ఇప్పటికే కొందరు అమరులయ్యారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్ రాజముద్ర వేసిన కొద్దిరోజుల్లోనే మరో రైతు ప్రాణాలు వదిలాడు. నిన్నటి వరకూ ఉద్యమంలో పాల్గొన్న నీరుకొండకు చెందిన నన్నపనేని వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందాడు. అన్నదాత మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తుళ్లూరులో రైతులు, మహిళల ధర్నా శిబిరాన్ని టిడిపి నేత దేవినేని ఉమా సందర్శించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు అమరావతికి మద్దతు పలికి ఇప్పుడు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యం, రాజ్యాంగం గొప్పది… ప్రభుత్వాలు శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. రైతులు, మహిళలది ధర్మపోరాటం, న్యాయపోరాటమని.. న్యాయస్థానాల్లో రైతులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వేళ ప్రాణాలకు తెగించి రైతులు పోరాడుతున్నారని దేవినేని ఉమా అన్నారు. 70 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదని దుయ్యబట్టారు. రాజధాని అంశం 29 గ్రామాల సమస్య కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని దేవినేని ఉమ అన్నారు.