ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో మరో అడుగు ముందుకు వేసింది.. దేశంలోనే తొలిసారిగా సీ ప్లేన్ ను ఏపీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల్లో కనిపించే సీ ప్లేన్ ఇక పై మన ఏపీలో కనిపించనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు అదికారులతో కలిసి సీ ప్లేన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రోన్ సదస్సుతో ప్రారంభమై.. ఇవాళ సీ ప్లేన్ డెమో కార్యక్రమంతో ఆకాశమే హద్దుగా ఏపీలో మరో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టనున్నారు. కూటమి ప్రభుత్వంలో సాంకేతికంగా, పర్యాటకంగా పలు నూతన కార్యక్రమాలు, ఆవిష్కరణలకు వేదికగా ఏపీ రాష్ట్రం మారిందన్నారు. దేశంలోనే వినూత్న కార్యక్రమాలు మా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి మా శాఖకు సీఎం చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతేనని అన్నారు.