ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బుడమేరు వాగుకు మళ్లీ వరద ఉధృతి కొనసాగుతోంది. ఈసారి ఏమవుతుందో అని బెజవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు బుడమేరు కాలువకు పడిన గండ్లను అధికారులు వేగంగా పూడుస్తున్నారు. మరోసారి భారీ వరద వస్తే కాలువకు మళ్లీ గండ్లు పడే అవకాశం సమాచారం. అయితే, బుడమేరు వాగుతో పాటు మరోవైపు పులివాగుకు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది.
దీంతో వరద నీరు విజయవాడలోకి రాకుండా బుడమేరు వద్ద శనివారం పూడ్చిన గండ్ల ఎత్తును పెంచుతున్నారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి వరకు పనులను పరిశీలించారు. మరోవైపు విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.మరోవైపు ముంపు గ్రామాల బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతిపై అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను సీఎం చంద్రబాబుకు అందజేస్తున్నట్లు తెలుస్తోంది.