పెరుగుతున్న ఇంధన ధరలు.. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని వాహనదారులకు సూచిస్తున్నాయి. మరోవైపు వాహనదారులు కూడా ఈ వెహికిల్స్ కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో చాలా కంపెనీ ఈ-వెహికిల్స్ ఉత్పత్తి చేసే పనిలో పడ్డాయి.
ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ హైదరాబాద్ నగరంలో మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను తెరిచేందుకు నిర్ణయించిన ఆ సంస్థ.. దేశవ్యాప్తంగా ఒకే రోజున ఈ తరహా 50 సెంటర్లను ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మూడు సెంటర్లు ప్రారంభమయ్యాయి.
మాదాపూర్‌లోని శ్రీరామ కాలనీలో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్‌లోని ఆదర్శ్ నగర్, మెహదీపట్నంలో రేతిబౌలిలో వీటిని ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభించింది. దీంతో హైదరాబాద్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఓలా విద్యుత్ వాహనాల కొనుగోలును సులభతరం చేయడంలో భాగంగా అన్ని ప్రధాన నగరాల్లో తమ ఉనికిని విస్తరిస్తున్నామని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సెంటర్లలో S1, S1 ప్రో మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశంతో పాటు కొనుగోలుకు ఉన్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు తెలుసుకోవచ్చు.