హైకమాండ్ తీరుతో ఏపీ బీజేపీ నేతలు బుక్కయ్యారా

-

ఏపీ బీజేపీ నేతలకు ఏమైందో ఏమో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పై ముందొక మాట.. మధ్యలో మరోమాట చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ప్రైవేటీకరణ చేయబోతున్నట్టు కేంద్రం బడ్జెట్‌లోనే స్పష్టంగా చెప్పింది. అయినా ఢిల్లీ మూడ్‌, నాయకుల ఆలోచన ఏంటో తెలుసుకోకుండా.. ఏదో ఆపేస్తాం… చించేస్తాం అన్నట్టు హస్తిన వెళ్లారు ఏపీ బీజేపీ నేతలు. మూడురోజులు ఢిల్లీలో ఉన్నా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన వారు సరిగా మాట్లాడలేదు.పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీ ఎందుకొచ్చారని మూడు ముక్కల్లో ఏపీ బీజేపీ నేతలకు తలంటేశారు.

ఢిల్లీలో ఎదురైన పరిణామాల తర్వాతైనా జాగ్రత్త పడాల్సిన నాయకులు.. మాట మార్చేశారు. ప్రైవేటీకరణ ట్వీటే పట్టించుకోనక్కర్లేదని ఢంకా భజాయించారు. ముందు వారు చెప్పిన మాటలు అతకకపోయినా.. నిజమే కాబోలు అన్నంత గట్టిగా అనుమానాలు కలిగించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఉద్యమిస్తున్న వారు కూడా ఆలోచనలో పడ్డారు. కానీ.. ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన 24 గంటల్లోపే ప్రధాని మోడీ చేసిన ప్రకటన అందరికీ షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వం వ్యాపారం చేయదు.. కీలకమైన నాలుగు తప్ప 100 PSUలను ప్రైవేటీకరిస్తామని మోడీ కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఏపీ బీజేపీ నేతలకు మైండ్‌ ఆబ్సెంట్‌ అయింది.

ప్రధాని మోడీ కీలకమైన ప్రకటన చేసిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు పత్తా లేరు. అది ఉత్తి ట్వీట్‌ అన్నవారు.. పోరాటమే అక్కర్లేదని ప్రకటించిన వారూ.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుందో ముందే తెలుసుకుని.. ఆచితూచి స్పందించి ఉంటే ఏపీ బీజేపీ నేతలకు ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే లాభమేంటో చెప్పాల్సి ఉంటే మరోలా ఉండేదని కొందరు బీజేపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పట్లో ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఓకే చెప్పారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చినప్పుడు చంద్రబాబే అంతా చేశారని విమర్శించారు బీజేపీ నాయకులు. అలాంటిది.. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే లాభమేంటో చెప్పకుండా ఆపుతాం అన్నట్టు బిల్డప్‌ ఇచ్చి చేసి చేతులు కాల్చుకున్నారు.

కేంద్రం నిర్ణయం తీసుకున్నవెంటనే దానిని సమర్ధిస్తూ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడి సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయారు. కానీ.. సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌, బీజేపీ జాతీయ నేత పురందేశ్వరి చేసిన ప్రకటనలే వ్యూహం లేకుండా సాగాయన్నది కమలనాథులు చెప్పేమాట. పైగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చుకోవడానికే లేని ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి బీజేపీపై బురదజల్లుతున్నారని మరింత రక్తికట్టించారు. ఇప్పుడేమైంది.. ఎక్కడా కనిపించకుండా గప్‌చుప్‌ అయ్యారు.

ప్రాంతీయ పార్టీలైతే ఏం మాట్లాడినా చెల్లుతుంది. జాతీయ పార్టీలకు అలా సాధ్యం కాదు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పార్టీ లైన్‌లోనే మాట్లాడాలి. ఏపీ బీజేపీ నేతలకు ఆ మాత్రం కూడా తెలియదా వ్యూహం లేకుండా ప్రవర్తించి బుక్కయిపోయారా అన్న చర్చ నడుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version