ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జనసేన మద్దతుదారులు 65 శాతం రెండవ స్థానంలో నిలవడం రాష్ట్రంలో మార్పునకు సంకేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 1209, సర్పంచ్‌లు, 1776 మంది ఉప సర్పంచులు, 4,456 వార్డు మెంబర్లు జనసేన మద్దతుతో గెలువడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయాలే త్వరలో రాష్ట్రంలో మార్పులు తీసుకురానున్నాయని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడా జనసేన మద్దతుదారులు గెలిచారో అక్కడ కేరళ తరహాలో పంచాయతీలను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
కేంద్ర నిధులు ఎక్కడా..?
తిత్లీ తుపాను సందర్భంగా శ్రీకాకులం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి పంచాయతీల పరిస్థితులను దగ్గరుండి వీక్షించానన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో జనం భయపడి వివిధ ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. విజయనగరం జిల్లా పెద్దపెంకి గ్రామంలో బోదకాలుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు గానీ.. అధికారులు గానీ.. పంచాయతీ వ్యవస్థ ఏం చేసిందని ప్రశ్నించారు. పల్లెల్లో పెత్తనం ఒకటి రెండో వర్గాల ఆధీనంలో ఉండటం కొన్ని కుటుంబాల ఆదిపత్యంలో గ్రామాలు నలిగిపోవడమే కారణమన్నారు. కేంద్రం నుంచి పంచాయతీలకు ని«ధులు వస్తున్నాయని అంటున్నారే తప్ప ఆ నిధులు ప్రజలకు అందినట్లు ఎక్కడా స్పష్టంగా లేదన్నారు.