ట్రాఫిక్ చ‌లానా క‌ట్ట‌మ‌న్న పోలీసులు.. మంగ‌ళ‌సూత్రం ఇచ్చేసిన మ‌హిళ‌..

-

వాహ‌న‌దారులు ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వాహ‌నాల‌ను న‌డిపించాల్సి ఉంటుంది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు చ‌లానా విధిస్తారు. అయితే సాధార‌ణంగా న‌గ‌రాల్లో ఎక్కువ‌గా ఇ-చ‌లాన్‌లే వేస్తుంటారు. చ‌లాన్ వేసిన‌ప్ప‌టికీ స్పాట్‌లో దాన్ని క‌ట్టాల్సిన ప‌నిలేదు. త‌రువాత పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కూడా క‌ట్ట‌వ‌చ్చు. అయితే ఈ విష‌యం తెలియ‌దో, అసలు ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. చ‌లానా క‌ట్ట‌మన్నందుకు ఆ మ‌హిళ త‌న మంగ‌ళ‌సూత్రాన్నే తీసి ట్రాఫిక్ పోలీసుల‌కు ఇచ్చేసింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంది.

క‌ర్ణాట‌క‌లోని బెల్గావి జిల్లాలో 30 ఏళ్ల భార‌తి విద్భూతి అనే మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి బైక్‌పై మార్కెట్‌కు వెళ్లింది. వారు మార్కెట్‌లో రూ.1700 పెట్టి మంచం కొన్నారు. మిగిలిన రూ.100తో టిఫిన్ చేశారు. అయితే ఆమె భ‌ర్త హెల్మెట్ లేకుండా ప్ర‌యాణం చేస్తున్నాడు. దీంతో ర‌హ‌దారి మ‌ధ్య‌లో ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి హెల్మెట్‌లెస్ డ్రైవింగ్‌కు రూ.500 ఫైన్ విధించారు. త‌మ వ‌ద్ద ఆ మొత్తం లేద‌ని, త‌మ‌ను విడిచిపెట్టాల‌ని వారు ప్రాధేయ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ట్రాఫిక్ పోలీసులు వినిపించుకోలేదు.

అలా ట్రాఫిక్ పోలీసుల‌కు ఆ దంప‌తుల‌కు సుమారుగా 2 గంట‌ల పాటు వాద‌న‌లు జరిగాయి. దీంతో విసుగు చెందిన ఆ మ‌హిళ త‌న మెడ‌లో ఉన్న మంగ‌ళ సూత్రాన్ని తీసి ట్రాఫిక్ పోలీసుల‌కు ఇచ్చేసింది. దాన్ని అమ్మి అందులో నుంచి చ‌లానా మొత్తాన్ని తీసుకోవాల‌ని కోరింది. అయితే అప్ప‌టికే అక్క‌డికి చేరుకున్న ప‌లువురు పోలీసు అధికారులు ఆ దంప‌తుల‌కు, ట్రాఫిక్ పోలీసుల‌కు స‌ర్ది చెప్పి పంపించేశారు. దీంతో గొడ‌వ స‌ద్దు మ‌ణిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version