ఆర్థికంగా రాష్ట్రానికి ఏమీ లేదు.ఆ విధంగా చూసుకుంటే అప్పుల లెక్కల్లో ఆంధ్రా చాలాముందుంది.దేశ వ్యాప్తంగా కూడా ఈ లెక్కలు ఇలానే ఉన్నాయి.మనం కాస్త ఎక్కువ అప్పులు చేసి రికార్డుల్లోకి ఎక్కుతున్నాం అన్న భావనను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రావాసులకు కల్పిస్తున్నారు.కాదు ఇదే స్థిరం చేస్తున్నారు.
ఈ క్రమంలో పాత అప్పుల గోల ఎలా ఉన్నా, కొత్త అప్పులు మాత్రం అస్సలు పుట్టవు అని తేలిపోయింది.ప్రణాళిక వ్యయం కన్నా ప్రణాళికేతర వ్యయమే ఎక్కువగా ఉంటుంది అని లెక్కలు చెబుతున్నాయి.అస్సలు బడ్జెట్ అనుమతి అన్నది లేకుండా ఇటీవల కాలంలో దాదాపు లక్ష కోట్లకు లెక్కలే లేకుండాపోయాయి అని కాగ్ గగ్గోలు పెట్టింది.అయినా కూడా జగన్ వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు అని విపక్షాలు భగ్గు మంటున్నాయి. ఈ దశలో ఈ నెల 11న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏం చెప్పనుంది అన్నదే ఆసక్తికరం.
సరిగా ఆదాయమే లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అనుకునేందుకు వీల్లేదు.పన్నలు వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణతో బాగానే పోటీ పడుతోంది.అందులో సందేహాలకు తావే లేదు.కేంద్రం నుంచి కూడా బాగానే నిధులు వస్తున్నాయి.కానీ నిధులన్నీ సంక్షేమం పేరిట ఖర్చయిపోతున్నాయి.ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల పేరిట కూడా నిధులు వస్తున్నాయి.అయినా కూడా ఆంధ్రాకు అప్పులే గతి అవుతున్నాయి.గడిచిన రెండున్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమానికే నిధులు వెచ్చించాం అని ప్రభుత్వం చెబుతోంది.పోనీ సంక్షేమ పథకాల అమలు అయినా బాగుందా అంటే కొందరికే అన్ని ఫలాలు అన్న విమర్శ కూడా ఉంది.ఈ దశలో ఏపీ ఒడ్డెక్కడం కష్టమే!
ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న రాష్ట్రం తమదని ఏపీ ప్రభుత్వ పెద్దలు వెళ్లి కేంద్రానికి చెప్పినా ఫలితం లేదు.తీవ్ర తుఫానులు, వరదలు వచ్చినప్పుడే తక్షణ సాయం కింద ఓ వెయ్యి కోట్లు ఇవ్వమంటేనే మోడీ పరివారం చుక్కలు చూపిస్తోంది.అలాంటిది రాష్ట్రాభివృద్ధి నిధులు ఇవ్వమంటే ఎందుకు ఇస్తుందని ? నిధుల కేటాయింపులో కూడా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఉన్నది అన్నది నిజం.ఇదే సమయంలో రాష్ట్రాలు తాము వద్దన్నా కూడా ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయన్న వాదన కేంద్రానిది.ఉచిత పథకాల కారణంగానే అభివృద్ధి పనులు పెద్దగా చేపట్టలేకపోతున్న దాఖలాలే ఇవాళ ఆంధ్రావనిలో నెలకొని ఉన్నాయి.
ఈ దశలో కేంద్రం ఎందుకని సాయం చేయాలి అన్న ప్రశ్న కూడా అధికార బీజేపీ వినిపిస్తోంది.ఈ దశలో నిధుల సర్దుబాటు,కేటాయింపు, వెచ్చింపు అన్నవి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర పరిధిలో ఉన్న విషయాలే ! వీటిపై ఆయనకు ఉన్న స్పష్టత ఎంత ? 3 రాజధానుల గోల ఓ వైపు జిల్లాల ఏర్పాటు మరో వైపు ఉన్నప్పుడు సమస్యలు తీరేదెలా?