ఈ సారి గ‌ల్లా త‌ప్పించుకోలేక పోయారు.. జ‌గ‌న్ దెబ్బ అదిరిపోయిందిగా

-

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను గురిచూసి కొట్ట‌డం అనేది ఒక ఆర్ట్‌. ఇది అంద‌రికీ అబ్బేది కాదు. దీంతో మేం అధికారంలో ఉండ‌గా ఇలా చేయ‌లేదు.. అందుకే మీరు స్వేచ్ఛ‌గా తిరిగారు అంటూ.. మొస‌లి క‌న్నీళ్లు పెడ‌తారు. ఇక‌, తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి చెందిన యాక్టివ్ ఎంపీ.. గ‌ల్లా జ‌య‌దేవ్‌కు అదిరిపోయే రీతిలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ల్లా ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ షాకివ్వ‌డం విశేషం. అంతేకాదు.. ఈ విష‌యాన్ని టీడీపీ కూడా రాజ‌కీయం చేసే అవ‌కాశం లేకుండా పోయింది.

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన‌ సంస్థ ‘అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్’కు గతంలో టీడీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో కేటాయించిన 253 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం అమర్ రాజా ఇన్‌ఫ్రాకు 253 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే… ఆ భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలూ జరగకపో వడంతో… వాటిని వెనక్కు తీసుకుంటున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలోని సర్వే నెం 65/1  లోని ఈ  భూములను  చంద్ర‌బాబు హ‌యాంలో అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే కేటాయించారు. ఈ భూముల్లో అంత‌ర్జాతీయ స్థాయిలో కంపెనీ పెడ‌తామ‌ని, ఉపాధి క‌ల్పిస్తామ‌ని అప్ప‌ట్లో గ‌ల్లా తెలిపారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కూడా దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నామ‌ని, ఖ‌చ్చితంగా ఇది స్థానికుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిలో ఎలాంటి కార్య‌క్ర‌మాలూ ప్రారంభించ‌లేదు. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ భూముల‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ప‌రిణామాల‌తో గ‌ల్లాకు గ‌ట్టి షాక్ ఇచ్చింద‌ని పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version