ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దాంతో రెండ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ తన సహాయకుడి మరణంతో పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్నారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే రాయలసీమ ప్రాంతానికే చెందిన నారాయణకు వైఎస్ కుటుంబంతో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది.
వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి నమ్మినబంటుగా ఉన్నారు. నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె. కాగా సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకుంటారు.