జగన్ మీడియాను కంట్రోల్ చేస్తున్నారా.. ఇందు కోసం తెచ్చిన కొత్త జీవోతో ఇక తనపై దుష్ప్రచారం చేసే పత్రికల పని పడతారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో ఇలాంటి జీవోను వైఎస్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ తీసుకొచ్చారు. కానీ దాన్ని అమలు చేయలేదు.
అప్పట్లోనే చంద్రబాబు, పత్రికలు ఈ అంశంపై ధర్నాలు చేస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే ఆలోచనలో కనిపించడం లేదు. ఏపీ సీఎం జగన్ మీడియాకు డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చేశారు. తప్పుడు వార్తలు రాసే మీడియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.
వాస్తవమైన ఆరోపణలు చేస్తే సంబంధిత శాఖలు వాటిపై స్పందించి దిద్దబాట్లు చేసుకుంటాయని.. కానీ కానీ కేవలం ప్రభుత్వానికి పేరు రాకూడదనే కక్షతో, సొంత కుల నాయకుడు ముఖ్యమంత్రి కాలేదనే అక్కసుతో వాస్తవాలను దాచి, ప్రజలను మభ్యపెడుతూ, తప్పుదోవ పట్టించేలా ఉండే కథనాలపై, అబద్ధపు వార్తలపై ఉపేక్షించే సమస్యే లేదని వైయస్ జగన్ స్పష్టం చేసారు.
అంతే కాదు.. ఈ ప్రయత్నాన్ని మీడియా నియంత్రణగా చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా చిత్రించేందుకు చేసే ప్రయత్నాన్ని కూడా ఆయన ఖండిస్తున్నారు. తప్పుడు ప్రేరేపిత నివేదికలపై చర్యలు తీసుకునేందుకు మంత్రివర్గ విభాగాల కార్యదర్శులకు ఇచ్చిన అధికారం మీడియాను నియంత్రించే చట్టం కాదని స్పష్టం చేశారు. ఇది కొత్తదేమీ కాదని.. ఇప్పటికే ఈ విధమైన జీవో ఉందని, దాని అధికారాన్ని వికేంద్రీకరించడం మాత్రమే చేశామని అంటున్నారు.