ఏపీలో మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఎప్పటి లానే ఈరోజు కూడా కేసులు పదివేలకు పైగా నమోదయ్యాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులను కట్టడి చేయ లేక పోతోందని చెప్పచ్చు. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,825 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 71 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,84,436కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 4,347 మంది మరణించారు.
ఇక ఏపీలో ఇప్పటివరకు 3,79,209 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,880 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లోనే 11,941 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. కాగా నిన్న ఒక్క రోజే 69,623 పరీక్షలు చేయగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,35,317 టెస్టులు చేశారు. ఈరోజు కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.