తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన మీద ఏపీ డీజీపీ స్పందించారు. బీజేపీ, టీడీపీ నేతలు, పలువురు స్వామీజీలు, పీఠాధీపతులు ఈ విషయంలో ఏదయినా కుట్ర కోణం ఉందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆయన స్పందించక తప్పలేదు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించారని, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకొని తక్షణం మంటలను అదుపులోకి తీసుకు వచ్చారని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ, ఏలూరు డిఐజి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిచారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విజయవాడ నుండి ఫోరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలో ఫోరెన్సిక్ లాబరేటరీ టీమ్ అలానే అగ్ని ప్రమాదాల వివరాలును సేకరించే నిపుణులైన అధికారుల బృందం సంఘటనా స్థలానికి బయలుదేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో వివరాలను సాక్ష్యాధారాలను సేకరించేందుకు పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆయన అన్నారు. ఇక ఈ ఘటనలో మానవ ప్రమేయం ఉంటే వారిని వదిలిపెట్టమని ఆయన అన్నారు.