రాష్ట్రంలో ఇప్పుడున్న జిల్లాలను మరింతగా పెంచుతానని, పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాగా ఏర్పాటు చేస్తానని.. ఎన్నికలకు ముందుగానే సీఎం జగన్ ప్రకటించారు. అయితే, ఏడాదిన్నర కాలం పాలన పూర్తియినా.. ఇప్పటి వరకు దీనిపై చర్యలు తీసుకోలేక పోయారు. అయితే, జిల్లాల అధ్యయనంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రెవెన్యూ మండలాల విస్తీర్ణం సహా రాష్ట్ర ముఖచిత్రంపై ఆయన నిత్యం దృష్టిపెడుతున్నారు. అధికారులతో చర్చిస్తున్నారు.
అయితే, వాస్తవానికి ఇప్పటికే ఈజిల్లాల ఏర్పాటు ప్రక్రియ పుంజుకోవాల్సి ఉన్నప్పటికీ.. వచ్చేఏడాది జరగనున్న జనాభా లెక్కల నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పుంజుకోలేదు. కానీ, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పటికే రెండు సార్లు జిల్లాల ఏర్పాటుపై జగన్.. మంత్రివర్గంతో చర్చించారు. ఈక్రమంలోనే అరకును రెండు జిల్లాలు చేయాలనే ప్రతిపాదనను మంత్రి పుష్పశ్రీవాణి తెరమీదకి తెచ్చారు. దీనికి జగన్ కూడా సై! అన్నారు.
ఇదిలావుంటే.. ఆదోని వంటి ప్రాంతాలను కూడా జిల్లాగా చేయాలనే డిమాండ్ నేపథ్యంలో సంఖ్యను పెంచేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, జిల్లాల ప్రక్రియ వేగవంతం అయిపోయినట్టు సంకేతాలు వచ్చాయి. నిజానికి వచ్చే ఏడాది నిర్వహించాల్సిన జనాభా లెక్కలను కరోనానేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా.. రాష్ట్ర డీజీపీ సంచలన ఆదేశాలు చేశారు.
రాష్ట్రంలో ఏ పోలీస్ విభాగంలోనూ బదిలీలు చేపట్టవద్దని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుందని, ఏ నిముషంలో అయినా.. ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో జిల్లాలు, మండల హెడ్ క్వార్టర్స్ సహా ఎక్కడా కూడా పోలీసుల బదిలీలు చేయొద్దని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం అత్యంత వేగంగా జిల్లాల ఏర్పాటుపై చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.